- బొగ్గు గనులపై ఏఐటీయూసీ ధర్నాలు
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు పనిముట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని బొగ్గు గనులు, ఓపెన్కాస్ట్లు, డిపార్ట్మెంట్లపై కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. లీడర్లు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతకే ప్రాధాన్యమిస్తున్న యాజమాన్యం.. కార్మికుల రక్షణను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
డ్రిల్రాడ్లు, డ్రిల్ బిట్లు, రెజిన్ క్యాప్యుల్స్, లైన్మైన్ కీలలు, సేఫ్టీ షూస్, గ్లౌజులు, గిరిమీట్లు, రంగు యూనిఫాములనువెంటనే అందించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆయా గనులు, ఓసీపీల సింగరేణి బాధ్యులకు వినతిపత్రాలు అందజేశారు. ధర్నాల్లో శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలకు చెందిన ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కె సమ్మయ్య, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బి.సుదర్శనం, శ్రీరాంపూర్ బ్రాంచి సెక్రటరీ బాజీసైదా, కొట్టి కిషన్, సారయ్య, కంది శ్రీనివాస్, ఎస్.రాజేశం, శర్మ, మల్లేశం, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
